తెలంగాణ, ములుగు. 17 సెప్టెంబర్ (హి.స.)
ములుగు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుండగా, జిల్లా యంత్రాంగం అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతోందని మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పొందుతున్న లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల వందన స్వీకారం చేసిన అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఎందరో మహానుభావుల త్యాగఫలితంగానే నేడు ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, త్యాగాలను ఎన్నటికీ మరవొద్దని సూచించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపును 48 గంటల్లోనే అమలు చేసిందని చెప్పారు. వాటికి తోడుగా రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్, నూతన రేషన్ కార్డుల జారీ, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతిష్ఠాత్మకంగా అమలు జరుగుతోందని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు