హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)
‘ రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రత పై వివరణాత్మక సమీక్ష నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈరోజు అనగా సెప్టెంబర్ 22 , 2025 న సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో జరిగిన భద్రతా సమీక్ష సమావేశంలో ఆగష్టు 2025 నెలకు గాను 13 మంది ఉద్యోగులకు “ఎంప్లాయీ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను అందజేశారు. సిబ్బంది అసురక్షిత పరిస్థితులను నివారిస్తూ తమ విధి నిర్వహణలో చురుకుదనం మరియు అంకితభావాన్ని ప్రదర్శించినందుకుగాను ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ అవార్డులు ఇవ్వబడతాయి. ఈ సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్ గారితోపాటు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు మరియు ఆరు డివిజన్లు అనగా సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ కు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్‌లు (డీ.ఆర్.ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జోన్ పరిధిలోని వివిధ డివిజన్ లకు చెందిన 13 మంది ఉద్యోగులకు విధి నిర్వహణలో అప్రమత్తతను ప్రదర్శించినందుకు మరియు అసురక్షిత పరిస్థితులను నివారించడానికి సకాలంలో చర్యలు చేపట్టినందుకు: సికింద్రాబాద్ డివిజన్-03, హైదరాబాద్ డివిజన్-02,గుంటూరు డివిజన్ -1 విజయవాడ డివిజన్-02, గుంతకల్లు డివిజన్- 04 మరియు నాందేడ్ డివిజన్-01 “ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను అందజేశారు. ఈ అవార్డు గ్రహీతలలో రైలు కార్యకలాపాల్లో నిమగ్నమైన స్టేషన్ మాస్టర్లు, లోకో పైలట్లు, పాయింట్స్ మాన్ మరియు కీమాన్ వంటి వివిధ వర్గాలకు చెందినవారు ఉన్నారు. ఈ సందర్బంగా జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతలను అభినందించారు మరియు వారి విధులను అత్యంత అంకితభావంతో నిర్వర్తించినందుకు వారిని అభినందించారు. ఈ అవార్డులు ఇతర ఉద్యోగులను మరింత అప్రమత్తంగా ఉండటానికి మరియు రైలు కార్యకలాపాలలో సురక్షితంగా ఉండేలా నిజాయితీగా పనిచేయడానికి ప్రేరేపిస్తాయని ఆయన పేర్కొన్నారు.
తరువాత జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ రైల్లు సజావుగా నడపడానికి జోన్ వ్యాప్తంగా చేపట్టిన వివిధ భద్రతా డ్రైవ్‌లపై ప్రధానంగా దృష్టి సారించారు. జనరల్ మేనేజర్ మెకానికల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మరియు సిగ్నల్ & టెలికమ్యూనికేషన్స్ సహా వివిధ విభాగాలకు సంబంధించిన భద్రతా కార్యాచరణ ప్రణాళికలను కూడా పరిశీలించారు. షంటింగ్ కదలికలలో షార్ట్ కట్ పద్ధతులను నివారించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. జోన్ వ్యాప్తంగా వివిధ సున్నిత ప్రదేశాలలో మరియు క్రాసింగ్‌లలో నిర్వహించిన భద్రతా తనిఖీలను సమీక్షించిన సమయంలో, సున్నితమైన ప్రాంతాలలో సరైన భద్రతను కొనసాగించడానికి ఏదేని చిన్న లోపాలు తలెత్తినచో వెంటనే వాటిని సరిదిద్దాలని ఆయన అధికారులను ఆదేశించారు. లోడింగ్‌పై దృష్టి సారించి క్రమం తప్పకుండా భద్రతా డ్రైవ్‌లు నిర్వహించాలని, వ్యాగన్‌లలోకి సరుకును లోడ్ చేసేటప్పుడు సరైన భద్రతను నిర్ధారించాలని మరియు వినియోగదారులకు వస్తువులను సురక్షితంగా మరియు సకాలంలో చెరవేయడానికి ముందు అన్నిఅంశాలలో వ్యాగన్ ఫిట్‌నెస్‌ను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఇంకా, జోన్ అంతటా చేపట్టిన స్టేషన్ పునరాభివృద్ధి పనుల పురోగతిపై జనరల్ మేనేజర్ వివరణాత్మక సమీక్ష నిర్వహించారు. పనులు చేసేటప్పుడు కార్మికుల భద్రతను నిర్ధారించడానికి పని ప్రదేశంలో అన్ని భద్రతా పరికరాలు అందుబాటులో ఉంచాలని, ప్రయాణీకుల ఇబ్బంది లేని కదలిక కోసం పని ప్రదేశంలో రద్దీని నివారించడానికి భవన నిర్మాణ వ్యర్ధాల వంటి అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సిబ్బంది పనివేళల గురించి చర్చిస్తూ, విధుల్లో ఉన్న సిబ్బందికి సరైన సమయం మరియు వ్యవధిలో సరైన విశ్రాంతి అందించడంపై దృష్టి సారించి ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. క్రూ విశ్రాంతి గదులలో సరైన శుభ్రత, పరిశుభ్రమైన ఆహారం, సరైన బెడ్ రోల్స్ మరియు తాగునీటి సౌకర్యం వంటి సరైన ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు.
జనరల్ మేనేజర్ ప్రధాన స్టేషన్లలో బ్యాటరీ కార్ల నిర్వహణ విధివిధానాలపై చర్చించారు. ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి బ్యాటరీ కార్ డ్రైవర్లు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు