
ఆత్రేయపురం, 02 జనవరి (హి.స.)
అంబేడ్కర్ కోనసీమ (Konaseema) జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ కు (Collector Mahesh Kumar) పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద పడవ పోటీల ట్రయల్ రన్ శుక్రవారం నిర్వహించారు. ప్రారంభోత్సవానికి కలెక్టర్ మహేశ్ కుమార్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే కయాకింగ్ పడవను కలెక్టర్ నడుపుతుండగా పడవ అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో కలెక్టర్ కాల్వలో పడిపోయారు. లైఫ్ జాకెట్ ఉండడంతో ఆయన నీటిలో మునగకుండా బయటపడ్డారు. అక్కడే ఉన్న సిబ్బంది, గత ఈతగాళ్లు వెంటనే స్పందించి కలెక్టరును వేరే పడవలోకి ఎక్కించారు. దీంతో కలెక్టర్ కు పెను ప్రమాదం తప్పింది. కలెక్టర్ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోనసీమ జిల్లాలో పడవ పోటీల ట్రయల్ రన్ ను నిర్వహిస్తున్నారు. దాన్ని ప్రారంభించేందుకు కలెక్టర్ మహేశ్ కుమార్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో పోటీదారులను ఉత్సాహపరించేందుకు తాను కూడా కయాకింగ్ పడవను నడిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV