
జమ్మూ కాశ్మీర్, 27 జనవరి (హి.స.)
వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి
మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో సిఆర్పిఎఫ్ జవాన్ సహా నలుగురు మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై జఖానీ-చెనాని ప్రాంతంలో ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డోడా నుండి జమ్మూ వైపు వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘోరం జరిగినట్లు అధికారులు తెలిపారు.
అదుపు తప్పిన బస్సు తొలుత ఒక మోటార్ సైకిల్ను ఢీకొట్టి, ఆపై రహదారి పక్కనే ఆగి ఉన్న లోడ్ క్యారియర్ను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్ పైన ఉన్న జవాన్, లోడ్ క్యారియర్ డ్రైవర్, మెకానిక్ సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..