
పుట్టపర్తి, 05 జనవరి (హి.స.)
రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీల్లో స్నేహితుల మధ్య నెలకొన్న విభేదాలు కారణంగా కొత్తచెరువు మండలం తిప్పాబట్లపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మహేష్ (31) హత్యకు గురయ్యాడు. ఈనెల 1న కొత్తచెరువు పోలీసుస్టేషన్‌లో రియల్ ఎస్టేట్‌్ వ్యాపారాల మధ్య తలెత్తిన విభేదాలతో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువురికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. రెండు రోజుల నుంచి కుమారుడు మహేష్ కన్పించడం లేదని నాగేంద్రమ్మ కొత్తచెరువు పోలీసుకు శనివారం ఫిర్యాదు చేశారు.
ఆదివారం పుట్టపర్తి ఎస్‌ఎస్ ఆసుపత్రి సమీపంలోని ఎగువ బావుల వద్ద హంద్రీనీవా కాలువలో మహేష్ మృతదేహాన్ని స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ విజయ్‌కుమార్ పోలీసులతో చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో మహేష్ మృతదేహంపై గాయాలు ఉండటంతో..హత్య కేసుగా పోలీసులు విచారణ చేపట్టారు. మహేష్‌ను హత్య చేసి దుప్పట్లో కప్పి అందులో రాళ్లు వేసి కాలువలో వేశారు. అనంతరం మృతదేహాన్ని పెనుకొండకు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. హత్య కేసులో కీలక వ్యక్తితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. 2025 ఫిబ్రవరిలో మహేష్‌కి వివాహం జరిగింది. తండ్రి వెంకట్రాముడు మూడేళ్ల కిందట క్యాన్సర్‌తో మృతి చెందాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ