
అమరావతి, 01 అక్టోబర్ (హి.స.) చేనేతలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో రెండో విడత నేతన్నల సేవలో ఆర్థిక సాయాన్ని చేనేతలకు సర్కార్ అందజేయనుంది.
ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఈనెల 3వ తేదీ వరకూ ‘నేతన్నల సేవలో’ లబ్ధిదారుల ఎంపిక గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రెండో విడత ఆర్థిక సాయానికి రాష్ట్ర వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రి సవిత పత్రికా ప్రకటన ద్వార తెలిపారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పారదర్శకంగా అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు.
అర్హులైన నేతలన్నలందరికీ రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి ప్రకటించారు. చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు. ప్రతి నేతన్నకూ ఆర్థిక మేలు చేకూర్చడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ఇప్పటికే నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. త్వరలో కొత్త పెన్షన్లను కూడా ఇవ్వబోతున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.
చేనేతలకు ఆర్థిక మేలు కలిగించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఇందులో భాగంగా పెట్టుబడిగా నూలు అందజేయనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. దీనివల్ల నేతన్నలపై పెట్టుబడి భారం పడుకుండా ఉంటుందన్నారు.చేనేత వస్త్రాల తయారీలో ముఖ్యమైన నూలును పెట్టుబడిగా రుణ రూపేణా సరఫరా చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. నేతన్నలు తయారు చేసిన చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసిన తరవాత ఆప్కో అధికారులు సరఫరా చేసిన నూలు మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన చెల్లింపులు చేయాలన్నారు. ముందుగా నూలు అందజేయడం వల్ల నేతన్నలపై పెట్టుబడి భారం తగ్గుందని మంత్రి సవిత తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV