శ్రీశైలంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు....శ్రీ కాళరాత్రి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ప్రసిద్ధ జ్యోతిర్లింగ, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబికా అమ్మవారు ఇవాళ శ్రీ కాళరాత్రి దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
Temple


హైదరాబాద్ , 17 అక్టోబర్ (హి.స.) ప్రసిద్ధ జ్యోతిర్లింగ, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబికా అమ్మవారు ఇవాళ శ్రీ కాళరాత్రి దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీకగా నిలిచే కాళరాత్రి రూపంలో భాసిల్లుతున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు.

ఉదయం నుంచే శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, చండీయాగాలు, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. చీకటిని, భయాలను తొలగించి శుభాలను ప్రసాదించే కాళరాత్రి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు.

రాత్రి వేళ ఘనంగా గజవాహన సేవ:

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాత్రి వేళ ఆదిదంపతులైన శ్రీశైల మల్లేశ్వర, భ్రమరాంబికా దేవుళ్లకు వైభవంగా గజవాహన సేవ నిర్వహించనున్నారు. విశేషంగా అలంకరించిన గజవాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో శ్రీశైల గ్రామోత్సవం కన్నులపండువగా జరిపించనున్నారు. భక్తుల మంగళవాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఈ గ్రామోత్సవం అత్యంత శోభాయమానంగా సాగనుంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ప్రసాద వితరణ సౌకర్యాలు కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande