
వరంగల్ , 17 అక్టోబర్ (హి.స.)వరంగల్ భద్రకాళి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఇవాళ శ్రీ మహాసరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చదువుల తల్లి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీ దేవి అలంకారంలో భాసిల్లుతున్న భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. వీణను ధరించి, శ్వేత వస్త్ర శోభితయై ప్రసన్న వదనంతో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తారక మంత్రాలను స్మరించుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అమ్మవారి పాదాల చెంత పుస్తకాలు, పెన్నులు ఉంచి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. జ్ఞానాన్ని, సద్బుద్ధిని ప్రసాదించాలని చదువుల తల్లిని వేడుకున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీరు, ప్రసాద వితరణ చేపట్టారు. రోజంతా ఆల ప్రాంగణం అమ్మవారి నామస్మరణలతో, మంత్రోచ్ఛారణలతో మారుమోగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్