
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)
రాష్ట్రంలోని 15 జిల్లాలకు సంబంధించిన 75 మంది నిరుద్యోగుల నుంచి వీసాలు, పరీక్షల పేరిట ఒక్కొక్కరి వద్ద రూ. 4.5 లక్షల చొప్పున వసూలు చేసి ప్రభుత్వ రంగ సంస్థ 'టామ్కామ్' ద్వారా జర్మనీ ఉద్యోగాలంటూ రెండేళ్లుగా మోసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం మాటలు నమ్మి నిరుద్యోగులు తమ తల్లులు, భార్యల మెడలోని పుస్తెలతాళ్లను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారని, రెండేళ్లు గడుస్తున్నా ఆ అప్పులకు వడ్డీలు కడుతూ రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ ఒక్కరికీ జర్మన్ కంపెనీతో ఇంటర్వ్యూ కూడా ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. B1 లాంగ్వేజ్ పరీక్ష పాసైన వారికి మళ్లీ B2 అంటూ కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. 9 మందిని జర్మనీకి పంపుతున్నామని ఘనంగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వం తీరా ఒక్కరినీ పంపలేదని ఎద్దేవా చేశారు. ఏదైనా సమస్య వస్తే 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్నో కోర్టుకు వెళ్లాలని అమాయక యువతతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించారు. టామ్కామ్ ద్వారా ఎంతమందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇచ్చారో ఆర్టీఐ (RTI) ద్వారా సమాచారం అడిగినా, చట్టబద్ధమైన గడువు దాటినా ప్రభుత్వం జవాబు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు