
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)
రానున్న వేసవిలో నీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు, ఇతర వాణిజ్య సంస్థలు తాగునీటిని వృథా చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. నీటి దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలతో పాటు నీటి కనెక్షన్ల తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది. తాగునీటి వృథా, దుర్వినియోగానికి సంబంధించిన ఘటనలు ప్రజల దృష్టికి వచ్చిన పక్షంలో సంబంధిత ఫొటోలు, వీడియోలు, వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, ఘటన జరిగిన ప్రాంతం, పూర్తి చిరునామాతో సహా జలమండలి వాట్సాప్ నంబర్ 99499 30003 కు సమాచారం అందించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కస్టమర్ కేర్ నంబర్ 155313 ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపింది. నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా ఈ హెచ్చరికలు ఏవీ తమకు కావన్నట్లుగా కొందరు వ్యవహరిస్తూ తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో తాగునీటి వృథా, దుర్వినియోగం చేస్తున్న ఓ పబ్ పై జలమండలి సీరియస్ యాక్షన్ తీసుకుంది. జూబ్లీహిల్స్ సర్కిల్ ఫోర్ ఫాదర్స్ పబ్ కు రూ.20 వేల జరమానాతో పాటు తాగునీటి కనెక్షన్ కట్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు