
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో గత అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాద సంఘటన చోటుచేసుకుంది. కూకట్ పల్లి లోని హరిజన సేవా సంఘం కాలనీలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
దోమల నివారణ కోసం స్థానికులు పెట్టిన పొగ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం.
దోమల పొగ కోసం పెట్టిన నిప్పు రవ్వల వల్ల మంటలు మొదట పక్కనే ఉన్న గుడిసెలకు వేగంగా వ్యాపించాయి. ఆ తర్వాత సమీపంలోని టింబర్ డిపోకి కూడా మంటలు అంటుకోవడంతో అవి మరింత ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో పలువురు పేదల గుడిసెలు, అందులోని సామాగ్రి పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. ఇది ఇలా ఉండగా మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే దగ్గర లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని కొద్దిసేపటికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమయానికి స్పందించడంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..