
యాదగిరిగుట్ట , 26 అక్టోబర్ (హి.స.)
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 36 వాట్ల యాక్సెంట్ లైట్ల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయని బీజేపీ యాదగిరిగుట్ట పట్టణ శాఖ నాయకులు ఆరోపించారు.
ఈ విషయంపై నేడు భువనగిరి కలెక్టరేట్ ఆవరణలో వారు మాట్లాడుతూ.
బహిరంగ మార్కెట్లో జీఎస్టీతో కలిపి రూ.640 ధర పలుకుతున్న లైట్‌ను మున్సిపాలిటీ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఒక్కో దానిని రూ.2,750 చొప్పున కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.. వీధి లైట్ల కొనుగోలులో మార్కెట్ ధరతో పోలిస్తే భారీ వ్యత్యాసంతో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారని, పట్టణంలో మున్సిపల్ నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. యాక్సెంట్ లైట్ల కొనుగోలు ప్రక్రియ, టెండర్ పత్రాలు, బిల్లులు, చెల్లింపులపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు