
హైదరాబాద్ , 27 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇంటింటా కుట్టు మిషన్ల’ పథకం అమలు తీరుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకంలో భాగంగా రాబోయే డిసెంబర్ 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.90 లక్షల మంది అర్హులైన బీసీ మహిళలకు ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
హైదరాబాద్లోని సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, కమిషనర్ బాలమాయాదేవి, మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాల కార్యదర్శి సైదులుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని మరింత పెంచాలని ఆదేశించారు. 1.90 లక్షల మంది లబ్ధిదారులకు నాణ్యమైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు సకాలంలో అందుబాటులోకి వచ్చేలా పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా సొంత కాళ్లపై నిలబడి ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. అధునాతనమైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం ద్వారా మహిళలు సులువుగా కుట్టు పని నేర్చుకుని గృహ పరిశ్రమలుగా లేదా సొంతంగా వ్యాపారాలను ప్రారంభించేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని అన్నారు.
దీంతోపాటు బీసీ సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్న ఇతర సంక్షేమ కార్యక్రమాలపై కూడా మంత్రి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో 38 బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వుల (జీవోలు) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా యంత్రాంగం నిరంతరం శ్రమించాలని, డిసెంబర్ 9 నాటికి పంపిణీకి సంబంధించిన అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్