
హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్లోని రామంతాపూర్ పెద్దచెరువు పరిసరాల్లో హైడ్రా అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలో నిర్మించిన భారీ షెడ్డును తొలగించారు. చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయనే సమాచారంతో అధికారులు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.
ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టడం వల్ల చెరువుల సహజ విస్తీర్ణం తగ్గడంతో పాటు వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చెరువుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న హైడ్రా, ఆక్రమణలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రామంతాపూర్ పెద్దచెరువు వద్ద ఉన్న భారీ షెడ్డును తొలగించింది.
చెరువుల భూములను ఆక్రమణల నుంచి కాపాడటం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ఇటువంటి చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. హైడ్రా చేపట్టిన ఈ తొలగింపు చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్