
హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)
ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లతో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సింగూరు నుంచి నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లో అత్యవసర తాగునీటి అవసరాల కోసం ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున అందించనున్నట్లు వివరించారు.
నీటి వనరుల లభ్యత, గ్రామాల అవసరాలను ముందుగానే అంచనా వేసి కార్యాచరణ రూపొందించాలని సీతక్క సూచించారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించి సరఫరా వ్యవస్థను సిద్ధం చేయాలని చెప్పారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్