తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Rain


హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, నేడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించింది.

ఇక నవంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రతను బట్టి పరిస్థితుల్లో మార్పులు ఉండవచ్చని తెలిపింది. రైతులు, ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande