
హైదరాబాద్, 05 అక్టోబర్ (హి.స.)
నిత్యావసర ధరల నియంత్రణపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
సామాన్యుడిపై పెను భారం పడుతుంటే ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దారుణం అని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
వెంటనే ధరల పెరుగుదలపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం మరి ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గాల్సింది పోయి.. బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయో చెప్పాలన్నారు. మీరు ఇస్తున్న నాణ్యత లేని సన్నబియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాక మరేమిటి? అని ప్రశ్నించారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు MSP పేరిట దక్కుతున్నది నామమాత్రపు ధరే.. కానీ మధ్య దళారులుకు దక్కుతున్నది క్వింటాకు రూ.8000 పై మాటేనన్నారు. రైతుకు గిట్టుబాటు ధర లేదు.. వినియోగదారుడికి అందుబాటు ధర లేదు కానీ మధ్యలో లాభపడుతున్నదని దళారులేనన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..