
హైదరాబాద్, 05 అక్టోబర్ (హి.స.) నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్కు చుట్టూ శాశ్వత ప్రాతిపదికన వన్ వే అమలు చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ప్రస్తుత రహదారులపై ఉన్న సెంట్రల్ డివైడర్లను తొలగించి, రోడ్లను పూర్తిగా ఆరు లేన్లుగా విస్తరించనున్నారు. అంతేకాకుండా, గతంలో రూపొందించిన ప్రాజెక్టు రీ-అలైన్మెంట్ పనులకు ఉన్నతాధికార యంత్రాంగం పచ్చజెండా ఊపింది. గత ప్రణాళికలోని 7 ఫ్లైఓవర్లు, 7 అండర్పాస్ల నిర్మాణాలకు బదులుగా పర్యావరణ పరిరక్షణ, వ్యయ నియంత్రణలను దృష్టిలో ఉంచుకుని కేవలం ఒక భారీ ఫ్లైఓవర్, ఒక అండర్పస్ను మాత్రమే నిర్మించేలా నూతన ప్రణాళికను ఖరారు చేశారు.
ఈ సరికొత్త ఇంజనీరింగ్ డిజైన్ ప్రకారం.. నాగార్జున సర్కిల్ నుంచి ప్రారంభమై కేబీఆర్ పార్క్ మీదుగా జూబ్లీహిల్స్ చెకో పోస్ట్ వరకు ఏకంగా 4.4 కిలోమీటర్ల పొడవైన భారీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ను నిర్మించనున్నారు. ఈ సుదీర్ఘ వంతెన నిర్మాణం పూర్తి కావడం వల్ల పంజాగుట్ట, బంజారాహిల్స్ వైపు నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్ వెళ్లే వేలాది మంది ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులకు ట్రాఫిక్ సిగ్నళ్ల చిక్కులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగనుంది. అలాగే వన్వే విధానం ద్వారా కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా నిరంతరాయంగా తిరిగే వెసులుబాటు కలగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు