ఢిల్లీలో సీఎం చంద్రబాబు కీలక భేటీలు.. ఏపీ ప్రాజెక్టులు, నిధులపై కేంద్రంతో వరుస చర్చలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు.
Chandra Babu Naidu


అమరావతి , 08 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, పోలవరం, గోదావరి–కావేరి అనుసంధానం, విశాఖ మెట్రో, బీచ్ కారిడార్ వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు చర్చలు జరిపారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ను జిల్లాల వారీగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ, కేంద్ర–రాష్ట్ర నిధుల భాగస్వామ్యం వంటి అంశాలు చర్చించనున్నారు.

ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు, నిధులు మంజూరు చేయాలని ప్రధానిని కోరానున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి, గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే అదనపు నీటిని వినియోగించుకునే మార్గాలు, గోదావరి–కావేరి నదుల అనుసంధానం వంటి అంశాలు కూడా చంద్రబాబు ఢిల్లీ చర్చల్లో ప్రాధాన్యం పొందనున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక ఆర్థిక సహాయం కోరే అవకాశం కూడా ఉంది. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు కేంద్ర సహకారం అందించాలని కూడా సీఎం కోరుతున్నారు. ఈ పర్యటన ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు, నిధులు, అనుమతులు సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande