
అమరావతి , 08 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో కీలకమైన పునఃపరిశీలన ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభమైంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన 46,62,583 మంది ఓటర్ల వివరాలను బూత్ లెవల్ అధికారులు మరోసారి పరిశీలించనున్నారు.
అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి బయటపడకుండా చూడటమే ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు.
ఇందులో చనిపోయిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు గుర్తించిన వారు, చిరునామాల్లో అందుబాటులో లేని వారు వంటి కేటగిరీల్లో ఉన్న ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలిస్తారు.
బీఎల్ఓలు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వారీగా తొలగించిన ఓటర్ల జాబితాలను తీసుకుని ఇంటింటికీ వెళ్లి పరిస్థితిని తెలుసుకుంటారు. ఓటు తొలగింపు పొరపాటున జరిగిందని తేలితే సంబంధిత వ్యక్తికి మళ్లీ ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం ఫారం–6 ద్వారా దరఖాస్తు చేయించనున్నారు.
ఈ ప్రక్రియ రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించబడిన నేపథ్యంలో అర్హులైన ఓటర్ల హక్కులు దెబ్బతినకూడదన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అందుకే ఈసారి పునఃపరిశీలనను మరింత పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. కొన్ని సందర్భాల్లో బీఎల్ఓల పరిశీలన, ఓటర్లతో మాట్లాడుతున్న దృశ్యాలను వీడియో, ఫొటోల రూపంలో నమోదు చేయాలని కూడా సూచనలు ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్