
హైదరాబాద్ , 01 నవంబర్ (హి.స.)
ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు అత్యంత కీలకమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు తాము పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడటం సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.
ఓటు హక్కు అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ప్రజాస్వామ్య అవకాశం అని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. కులం, మతం, ప్రాంతం వంటి భేదాలు లేకుండా ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు వేసే అవకాశం ఉండాలని స్పష్టం చేశారు. అయితే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను అడ్డుపెట్టుకుని బీజేపీ నేతలు అర్హులైన పౌరుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత ఉండటంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు అందులో కొనసాగాలని అభిప్రాయపడ్డారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్