
నెల్లూరు , 10 నవంబర్ (హి.స.)
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో కార్మికులు నిరసనకు దిగారు. దీపావళి పండుగ సందర్భంగా తమకు చెల్లించాల్సిన బోనస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పోర్టులోని ఎస్ఎస్-2 భవనం ఎదుట కార్మికులు పెద్ద సంఖ్యలో చేరి నిరసన తెలిపారు.
పండుగ సమయం సమీపించినప్పటికీ బోనస్ చెల్లింపులపై స్పష్టత లేకపోవడంతో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏటా పండుగల సందర్భంగా అందించే బోనస్‌ను ఈసారి కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. తమ శ్రమతో పోర్టు కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, కార్మికుల సంక్షేమాన్ని యాజమాన్యం విస్మరించకూడదని పేర్కొంటున్నారు.
కార్మికుల ఆందోళన నేపథ్యంలో పోర్టు యాజమాన్యం అప్రమత్తమైంది. యాజమాన్య ప్రతినిధులు నిరసనకారులతో చర్చలు జరుపుతున్నారు. బోనస్ చెల్లింపుల విషయంలో కార్మికులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. చర్చల అనంతరం యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై కార్మికుల తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉండనుంది. ప్రస్తుతం పోర్టు పరిసరాల్లో ఈ నిరసన చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్