
అమరావతి , 10 నవంబర్ (హి.స.)
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో విచారించారు. ఈ విచారణ సుమారు గంటన్నరపాటు కొనసాగింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్కు హాజరుకావడం తనకు కొత్త అనుభవమేమీ కాదని వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు కూడా హాజరైనట్లు గుర్తుచేశారు.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని అంబటి ఆరోపించారు. ముద్రగడకు గౌరవ వందనం అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు ముందుగానే చెప్పినప్పటికీ, పోలీసులు ఎవరికీ తెలియకుండా గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అందుకే పోలీసుల ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామని వివరించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తనను ప్రశ్నించినట్లు వెల్లడించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడలేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలీసుల విచారణకు సహకరించామని, ఈ వ్యవహారంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని మీడియా ముందు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్