
అమరావతి , 13 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు-2026లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ప్రభుత్వం అందించే నగదు ప్రోత్సాహకాలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ప్రోత్సాహకాలను పొందాలంటే కేవలం సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైతే సరిపోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్పంచ్తో పాటు గ్రామంలోని అన్ని వార్డు సభ్యుల స్థానాలు కూడా ఏకగ్రీవం కావాల్సి ఉంటుంది. అప్పుడే సంబంధిత పంచాయతీ నగదు ప్రోత్సాహకానికి అర్హత సాధిస్తుంది.
ప్రభుత్వం అందించే ప్రోత్సాహక మొత్తాన్ని గ్రామాభివృద్ధి, ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాల కోసమే ఖర్చు చేయాలని నిబంధన విధించింది. ఈ నిధులను పంచాయతీ పాలకవర్గం పదవీకాలంలో విడతల వారీగా విడుదల చేయనుంది. ఈ ఉత్తర్వులు కేవలం 2026 గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలకు మాత్రమే వర్తిస్తాయి.
అదేవిధంగా ఏకగ్రీవ ఎన్నికల పేరుతో అభ్యర్థుల పోటీ హక్కులను అడ్డుకోవడం, ఓటర్ల స్వేచ్ఛకు భంగం కలిగించడం వంటివి చేయకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని స్పష్టం చేసింది.
నవంబర్ 14న పాఠశాలలకు పని దినం
గుంటూరు జిల్లాలో నవంబర్ 14 రెండో శనివారం అయినప్పటికీ అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలను తెరిచి ఉంచాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు. ఆ రోజు తప్పనిసరిగా పాఠశాలలు పనిచేయాలని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్