ఎంఎస్ఎంఈలకు పెద్దపీట వేస్తాం.. పారిశ్రామికంగా ఏపీని బలోపేతం చేస్తాం: మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Lokesh


అమరావతి , 13 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. భారీ పరిశ్రమలతోపాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో పరిశ్రమలకు అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్రంలో బలమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ప్రదర్శనను మంత్రి లోకేశ్ సందర్శించారు. అక్కడ వివిధ సంస్థలు తయారు చేసిన పారిశ్రామిక ఉత్పత్తులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాలు, వినూత్న ఆవిష్కరణలను ఆసక్తిగా పరిశీలించారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే డ్రోన్లు, విద్యా రంగంలో ఉపయోగించే రోబోట్లు, క్వాంటం కంప్యూటింగ్ పరికరాల పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు. వారి వ్యాపార కార్యకలాపాలు, వార్షిక ఆదాయం, సంస్థల ద్వారా కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాల గురించి ఆరా తీశారు. చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధితో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande