
మహబూబాబాద్ , 13 నవంబర్ (హి.స.)
మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం విఫలం కావడంతో నడివాడకు చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యువతి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఆత్మహత్యకు ముందు యువతి రాసిన సూసైడ్ నోట్లో ఎనిమిది మంది పేర్లు ప్రస్తావించినట్లు సమాచారం. తన మరణానికి వారే కారణమంటూ ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సూసైడ్ నోట్లో పేర్లు ఉన్న ఎనిమిది మందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో మహబూబాబాద్ అండర్ బ్రిడ్జి వద్ద బంధువులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, యువతి ఆత్మహత్యకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతి రాసిన సూసైడ్ నోట్‌ను పరిశీలించి అందులో పేర్కొన్న అంశాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్