సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చెరువుల హద్దులు నిర్ధారించాలి.. ములుగు జిల్లా కలెక్టర్
ములుగులోని సమీకృత జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం చిత్తడి నేలల సర్వే పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది
Collector


ములుగు, 17 నవంబర్ (హి.స.)

ములుగులోని సమీకృత జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం చిత్తడి నేలల సర్వే పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తించిన చిత్తడి నేలలకు సంబంధించిన చెరువుల సర్వే, హద్దుల నిర్ధారణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారం రోజుల్లో వీలైనన్ని చెరువుల సర్వేలు పూర్తి చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చెరువుల పరిధిని గుర్తించి, హద్దులు నిర్ధారించి సరిహద్దు గుర్తులు పెట్టాలని సూచించారు. చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం, గరిష్ఠ వరద నీటిమట్టాన్ని దృష్టిలో పెట్టుకుని సర్వే చేయాలని స్పష్టం చేశారు.

రెవెన్యూ, అటవీ, నీటిపారుదల శాఖల అధికారులు కలిసి సంయుక్త సర్వే చేయాలని, అవసరమైతే వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖల సహకారం తీసుకోవాలని చెప్పారు. సర్వే పనుల్లో ఉన్న నెమ్మదిని అధిగమించి క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande