అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వ అవినీతిని బయట పెడుతున్నారు.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి
అధికార పార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడుతుంటే రాష్ట్రంలో ఎలాంటి పాలన ఉందో అర్థమవుతోందని విమర్శించారు ఏలేటి.
Bjp


హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)

నగరంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అధికారుల అవినీతిపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడుతుంటే రాష్ట్రంలో ఎలాంటి పాలన ఉందో అర్థమవుతోందని విమర్శించారు.

తెలంగాణలో భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై అనిరుధ్ రెడ్డి మరో నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినా ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదని ఆరోపించారు. గత నెలలో తన నియోజకవర్గానికి చెందిన రూ.40 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆయన హెచ్చరించారని మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.

తాజాగా 20 నుంచి 30 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు క్లియర్ అవుతున్నాయని అనిరుధ్ రెడ్డి ఆరోపించడం ద్వారా బీజేపీ మొదటి నుంచి చెబుతున్న చేదు నిజాన్ని మరోసారి నిర్ధారించారని అన్నారు. . పనులు దక్కించుకోవడానికి, చేసిన పనులకు బిల్లులు పొందడానికి బిల్లు విలువలో 20 నుంచి 25 శాతం వరకు 'బీ ట్యాక్స్' పేరుతో కమీషన్లు అడుగుతున్నారని డిప్యూటీ సీఎంను పరోక్షంగా ఉద్దేశించి ఆరోపణలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande