కొండను ఢీకొన్న కంటైనర్.. డ్రైవర్ మృతి.. ఆపై మరో ప్రమాదం
పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాచిపెంట మండలం పి.కోనవలస సమీపంలో ఓ కంటైనర్ అదుపుతప్పి కొండను ఢీకొట్టింది.
Accident


పార్వతీపురం మన్యం , 17 నవంబర్ (హి.స.)

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాచిపెంట మండలం పి.కోనవలస సమీపంలో ఓ కంటైనర్ అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న కంటైనర్ను తొలగించేందుకు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. క్రేన్ను రప్పించి కంటైనర్ను పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు.

అయితే ఈ క్రమంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ బ్రేకులు విఫలం కావడంతో అదుపు తప్పి బస్సు, క్రేన్, కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ సమయంలో జగదల్పూర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వరుస ప్రమాదాలతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande