
హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ఇంటర్ బోర్డును రద్దు చేస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కవిత, విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసే ముందు మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో విస్తృతంగా చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల డ్రాప్ అవుట్స్‌ను సాకుగా చూపుతూ ఇంటర్ బోర్డును ఎత్తివేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న గణాంకాలు పూర్తిగా అవాస్తవమని కవిత కొట్టిపారేశారు. పరిపాలనాపరమైన మార్పులను (అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్) విద్యా సంస్కరణలుగా (ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్) భ్రమపడవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. ఇంటర్ బోర్డు రద్దు ఆలోచనను తాము పూర్తిగా వ్యతిరేకించడం లేదని స్పష్టం చేసిన ఆమె, ఇలాంటి విధానపరమైన మార్పులను హడావుడిగా కాకుండా కనీసం మూడు నుంచి పదేళ్ల సుదీర్ఘ ప్రక్రియ ద్వారా దశలవారీగా అమలు చేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi