
హైదరాబాద్ , 18 నవంబర్ (హి.స.) తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వారికి, ముఖ్యంగా ASDD (గైర్హాజరు, వలస, మరణం, డూప్లికేట్) కేటగిరీల కింద తొలగించబడిన ఓటర్లకు తమ ఓటు హక్కును తిరిగి పొందేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తమ హక్కును కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ సవరణ ప్రక్రియలో కీలక మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రత్యేక ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి:
ఫారాల ముద్రణ & పంపిణీ: నవంబర్ 18వ తేదీ లోపు ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ పూర్తి చేసి, నవంబర్ 18 నుంచి 30వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఓటర్లకు వాటిని పంపిణీ చేసి తిరిగి సేకరించనున్నారు.
దరఖాస్తుల పరిష్కారం: సేకరించిన ఫారాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను డిసెంబర్ 10వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు.
అభ్యంతరాల స్వీకరణ: ఓటర్ల జాబితాపై ఏవైనా క్లెయిమ్స్ లేదా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 15వ తేదీ వరకు స్వీకరించి, ఆయా సమస్యలను పరిష్కరిస్తారు.
తుది జాబితా విడుదల: అన్ని సవరణలు పూర్తయిన తర్వాత, డిసెంబర్ 22వ తేదీన తెలంగాణ తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఓటర్ల జాబితా నమోదు లేదా సవరణలకు సంబంధించి ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా ఓటర్లు నేరుగా ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేసి సహాయం పొందవచ్చని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్