
హైదరాబాద్ , 18 నవంబర్ (హి.స.) కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బల్మూరి వెంకట్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని బల్మూరి వెంకట్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో కొత్తూరు మండల పరిధిలోని జాతీయ రహదారి (NH-44) దర్గా చౌరస్తా (వినాయక స్టీల్ సమీపంలో) వద్దకు రాగానే ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న కోళ్ల లోడు డీసీఎం (లారీ) వాహనం అకస్మాత్తుగా మలుపు తీసుకోవడం లేదా నియంత్రణ కోల్పోవడంతో వెంకట్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో కారులో బల్మూరి వెంకట్, ఆయన సతీమణి ఇందుజ, సోదరుడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నారు. ఢీకొన్న వెంటనే కారులోని ఎయిర్ బ్యాగులు సకాలంలో తెరుచుకోవడంతో వారందరికీ ప్రాణాపాయం తప్పింది. వెంకట్ దంపతులకు, సోదరుడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తామంతా క్షేమంగానే ఉన్నామని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్