మురసు తుఫాన్ సహాయక చర్యలకు తమిళనాడు, కర్ణాటక సాయం కోరిన చంద్రబాబు
మురసు తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాల సహకారం కోరారు.
Chandrababu


అమరావతి , 02 నవంబర్ (హి.స.)

మురసు తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాల సహకారం కోరారు. ఇందులో భాగంగా తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో పునరుద్ధరణ పనులకు అదనపు సిబ్బంది, అవసరమైన యంత్రాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, వైర్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతు పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని చంద్రబాబు వివరించారు. ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారు. విద్యుత్ శాఖకు చెందిన సిబ్బందితో పాటు అవసరమైన పరికరాలు, యంత్రాలను పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు.

సహాయక చర్యల్లో భాగంగా మూడు రాష్ట్రాల అధికారుల మధ్య నిరంతర సమన్వయం ఉండాలని చంద్రబాబు సూచించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి వచ్చిన విద్యుత్ సిబ్బంది ఏపీలో పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారు. తాజాగా తమిళనాడు, కర్ణాటక సహకారం కూడా అందనుండటంతో విద్యుత్ పునరుద్ధరణ పనులకు మరింత ఊతం లభించనుంది. ప్రజలకు సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande