
నాగర్ కర్నూల్, 02 నవంబర్ (హి.స.)
పీఎం రహత్ పథకం అమలు, బాధితులకు అందుతున్న చికిత్స, ఆసుపత్రుల్లో నమోదు ప్రక్రియను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సోమవారం నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి పరిశీలించారు.
రోడ్డుప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ పథకం ద్వారా సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పోలీసు, వైద్య అధికారులను ఆదేశించారు.
పీఎం రహత్ పథకం కింద బాధితులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రి స్థాయిలో చేపడుతున్న నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. బాధితుల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, ఆసుపత్రిలో చేరిన వివరాలు, ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పీఎం రహత్ పథకం కింద ఒక్కో బాధితుడికి రూ.1.50 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..