
అమరావతి , 02 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాలు జారీ చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన దివ్యాంగులు ముందుగానే వైద్య పరీక్షల కోసం స్లాట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని నేటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ఈ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.
గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ‘మన మిత్ర’ వాట్సాప్ సేవలు, ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తుదారులు స్లాట్లు నమోదు చేసుకోవచ్చు. మొత్తం 21 రకాల వైకల్యాలకు సంబంధించి ప్రత్యేకంగా స్లాట్లు కేటాయించనున్నారు. ప్రతి వైకల్యానికి సంబంధించిన వివరాలను పరిశీలించి, సంబంధిత కేటగిరీలోనే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఉన్న విభాగాలతో పాటు యాసిడ్ దాడి బాధితులు, అభ్యాస సంబంధిత వైకల్యాలు ఉన్నవారు, ఆటిజంతో బాధపడుతున్నవారు, బహుళ వైకల్యాలు కలిగినవారికి కూడా ప్రత్యేక కేటగిరీలను ఏర్పాటు చేశారు. వీరు తమ వైకల్యానికి అనుగుణంగా స్లాట్ బుక్ చేసుకోవాలి.
స్లాట్ నమోదు సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు దరఖాస్తుదారులు ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి. వాట్సాప్ ద్వారా సేవలు పొందాలనుకునేవారు 9552300009 నంబర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ అవకాశాన్ని అర్హులైన దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్