
అమరావతి , 20 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మైనింగ్ శాఖ పనితీరు, భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త ఖనిజ నిక్షేపాలను గుర్తించడంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకునే అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)ని దేశంలోనే అత్యుత్తమ మైనింగ్ సంస్థగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. సంస్థ పరిధిలోని ఖనిజ వనరుల మొత్తం విలువ సుమారు రూ.7.8 లక్షల కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఏపీఎండీసీ ఈక్విటీ విలువను రూ.86,290 కోట్లుగా లెక్కించారు. సంస్థను స్టాక్ మార్కెట్లో నమోదు చేసేందుకు ఐపీవో ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు.
అలాగే, అరుదైన ఖనిజాల అన్వేషణ, అభివృద్ధికి ప్రత్యేకంగా ఏపీ రేర్ ఎర్త్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. మరోవైపు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు సరఫరా కోసం మూడు బొగ్గు బ్లాకుల వేలంలో ఏపీఎండీసీ పాల్గొంటోంది. ఖనిజ సంపదను భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే ఆర్థిక ఆస్తిగా మార్చాలని సీఎం స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్