
శ్రీకాకుళం, 20 నవంబర్ (హి.స.)
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తీవ్ర తుపాను ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. తుపాను బాహ్యవలయం తీరాన్ని తాకడంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఒడిశా సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. పలుచోట్ల ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ప్రస్తుతం తుపాను కేంద్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య గోపాల్పూర్ సమీపంలో తుపాను పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించింది.
తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంచిలి, కవిటిలో 10 సెంటీమీటర్లు, పలాసలో 9.9, సోంపేటలో 9.2, వజ్రపుకొత్తూరులో 4.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మందస మండలంలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. తుపాను పూర్తిగా తీరం దాటే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్