
అమరావతి , 20 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో ఈనెల 26న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కార్మికశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్లో ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఈ మేరకు షాపులు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పెయిడ్ హాలిడే వర్తించనుంది.
రాష్ట్రంలోని నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల పరిధిలో ఈ సెలవు అమలు చేయాలని కార్మికశాఖ నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రైవేటు సంస్థలు, వ్యాపార సముదాయాలు తమ సిబ్బందికి తప్పనిసరిగా సెలవు కల్పించాలని సూచించింది. సెలవు ఇచ్చినప్పటికీ ఉద్యోగులకు ఆ రోజు వేతనంలో ఎలాంటి కోత విధించకూడదని స్పష్టం చేసింది.
ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు హక్కు అత్యంత కీలకమైనందున ప్రతి ఉద్యోగి ఓటు వేసే అవకాశం పొందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యాలు కార్మికశాఖ ఆదేశాలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల రోజున ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్