పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచిన ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
Chandrababu Naidu


అమరావతి , 21 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచిన ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు పరిషత్ ఎన్నికల్లోనూ ప్రజలు కూటమి అభ్యర్థులకు మంచి విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ఈ ఫలితాలు ప్రభుత్వ పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామని చెప్పారు.

పరిషత్ ఎన్నికల్లో కూటమి 96.4 శాతం స్ట్రైక్ రేట్ సాధించిందని చంద్రబాబు వెల్లడించారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం విజయాల రేటు నమోదైందని తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి 3.6 శాతం ఓట్లు అదనంగా పెరిగాయని వివరించారు.

మరోవైపు వైఎస్సార్సీపీని ఉద్దేశిస్తూ 'గొడ్డలి పార్టీ' అంటూ విమర్శలు చేశారు. ఆ పార్టీకి గతంలో 39.8 శాతం ఉన్న ఓట్ల వాటా ప్రస్తుతం 6 శాతానికి పైగా తగ్గిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తమ రెండున్నరేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా ఈ ఫలితాలను పరిగణిస్తున్నామని చెప్పారు. ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరిగినా, బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించినా, పోస్టల్ బ్యాలెట్ అయినా ప్రజల తీర్పు కూటమికే అనుకూలంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande