ఆసియాలోనే అతిపెద్ద పానీయాల తయారీ ప్లాంట్.. 12 నెలల్లోనే ఉత్పత్తికి సిద్ధం: లోకేశ్
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగానికి సంబంధించి మరో కీలక ముందడుగు పడిందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
Lokesh


అమరావతి , 21 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగానికి సంబంధించి మరో కీలక ముందడుగు పడిందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఆసియాలోనే అతిపెద్ద పానీయాల తయారీ ప్లాంట్ కేవలం 12 నెలల వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తికి సిద్ధమైందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఈ ప్లాంట్ నిదర్శనమని పేర్కొన్నారు.

మొత్తం 10 ఉత్పత్తి లైన్లతో ఈ భారీ పరిశ్రమను నిర్మించినట్లు లోకేశ్ వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ సమయం పడుతుందని, కానీ ఏడాది కాలంలోనే నిర్మాణం నుంచి ఉత్పత్తి దశకు చేరుకోవడం విశేషమని వివరించారు.

ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో అమలవుతున్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానానికి ఉదాహరణగా అభివర్ణించారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

అయితే ఈ భారీ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏ సంస్థ దీనిని నిర్మించింది? అనే వివరాలను మంత్రి ప్రస్తుతం వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తే రాష్ట్ర పారిశ్రామిక రంగానికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande