
హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డికి కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 24న నాంపల్లి కోర్టు కెసిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది.
జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. మద్యం సేకరణలో జరిగిన అక్రమాల వల్ల రూ. 3,500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఈడీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు బెయిల్‌పై బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని, అందువల్ల బెయిల్‌ను రద్దు చేసి నిందితుడిని లొంగిపోయేలా ఆదేశించాలని కోరారు.
ఈ వాదనల అనంతరం న్యాయమూర్తి కెసిరెడ్డికి నోటీసులు జారీ చేస్తూ, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా, కాంట్రాక్టుల కేటాయింపులలో జరిగిన అక్రమాలకు సంబంధించిన కేసులో కెసిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలను మనీలాండరింగ్ నిరోధక సంస్థ అయిన ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే నిందితుల నుంచి రూ. 441.63 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi