
హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటిస్తున్నారు. తిరుపతి పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా పాల్వంచకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు పాల్వంచలోని నవభారత్ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాల్వంచలో త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సుదర్శన హోమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన సతీసమేతంగా హాజరుకానున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించే హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో స్థానికంగా సందడి నెలకొంది. ఆయన రాకతో ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో సీఎం పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్