
అమరావతి , 26 నవంబర్ (హి.స.)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదని, కోట్లాది మంది భక్తుల భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనం భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుందని తెలిపారు.
తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఓ భక్తుడు శ్రీవారికి భారీ మొత్తంలో విరాళం అందించడం విశేషమని చెప్పారు. చెన్నై నగరానికి చెందిన అగర్వాల్ అనే భక్తుడు మొత్తం రూ.206 కోట్ల విలువైన విరాళంతో 121 కిలోల బంగారు ఆభరణాలు, స్వర్ణ వస్త్రాలను తయారు చేయించడం చారిత్రాత్మక ఘట్టమని కొనియాడారు. ఇందులో భాగంగా 106 కిలోల బంగారంతో శ్రీవారికి, 15 కిలోల బంగారంతో పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రాలు రూపొందించినట్లు వివరించారు.
భగవంతుడిపై అపారమైన భక్తి, విశ్వాసంతో సదరు భక్తుడు ఇంతటి గొప్ప విరాళాన్ని అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో తాను కూడా భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. భక్తుల సేవాభావం, దైవభక్తికి ఈ విరాళం నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్