ఉద్యోగం, డబ్బు, హోదా కంటే మహిళల ఆత్మగౌరవమే ముఖ్యం.. ఖమ్మం జిల్లా కలెక్టర్
ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పోష్ చట్టం-2013పై అవగాహన కార్యక్రమం జరిగింది
Collector


ఖమ్మం, 26 నవంబర్ (హి.స.)

గురువారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పోష్ చట్టం-2013పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

చాలా సందర్భాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు బయటకు రావడం లేదని ఆయన అన్నారు. ఫిర్యాదు చేస్తే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో పాటు మరికొన్ని కారణాల వల్ల బాధితులు మౌనంగా ఉండిపోతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించి వేధింపులకు గురైన వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు మౌనంగా ఉంటే నిందితులు తప్పించుకునే అవకాశం ఉంటుందని, స్నేహంగా మాట్లాడామని, అది వేధింపు అవుతుందని తెలియదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారని పేర్కొన్నారు.

వేధింపులకు గురైన మహిళలు భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ కోరారు. ఉద్యోగం, డబ్బు, హోదా కంటే మహిళల ఆత్మగౌరవమే ముఖ్యమని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande