
అమరావతి , 03 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో వెలువడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓట్ల రూపంలో స్పష్టంగా వెల్లడించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందిస్తున్న సుపరిపాలన, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించిన ప్రజలు కూటమికి అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించినప్పుడే వారి విశ్వాసాన్ని పొందగలమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ప్రజల మనోభావాలు స్పష్టంగా ప్రతిబింబించాయని, కూటమి ప్రభుత్వంపై వారికున్న నమ్మకానికి ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, వారి సమస్యలకు వేగంగా పరిష్కారం చూపాలని సూచించారు.
'గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్' అనేదే తన పాలనా విధానానికి ప్రధాన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా సంక్షేమం, సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా స్వీకరించి మరింత మెరుగైన పాలన అందిస్తామని వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్