మరో నాలుగు నగరాల్లో ఇందిరమ్మ టవర్లు నిర్మాణం: మంత్రి పొంగులేటి
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా త్వరలో మరో నాలుగు నగరాల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
Minister Ponguleti


హైదరాబాద్ , 04 నవంబర్ (హి.స.)

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా త్వరలో మరో నాలుగు నగరాల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ కార్పొరేషన్ల పరిధిలో ఈ టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొలి విడత నిర్మాణాలకు సంబంధించి దీపావళిలోపే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నాలుగు నగరాల్లో జీ+5 విధానంలో ఇందిరమ్మ టవర్లను నిర్మించనున్నారు.

ఇప్పటికే పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. మొదటి విడతలో మొత్తం 2,21,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని చెప్పారు. రెండో విడతలో అదనంగా 4.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం కేటాయించిందని వివరించారు.

ఇక క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్ల ద్వారా లక్ష ఫ్లాట్ల నిర్మాణం చేపడుతున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందించేందుకు నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande