
హైదరాబాద్ , 04 నవంబర్ (హి.స.)
తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించే లక్ష్యంతో కొడంగల్లో మెగా రైతు మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది. నవంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు మేళాను అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడే వివిధ రకాల వ్యవసాయ సాంకేతికతలు, నూతన సాగు విధానాలు, ఆధునిక యంత్ర పరికరాలను పరిచయం చేసేందుకు మొత్తం 150 ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, అందుబాటులో ఉన్న నూతన పద్ధతుల గురించి రైతులకు వివరించనున్నారు.
మూడు రోజులపాటు జరిగే ఈ మేళాలో రైతులకు ఆధునిక వ్యవసాయంపై నిపుణుల ద్వారా అవగాహన కల్పించనున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడం, సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వంటి అంశాలపై వివరాలు అందించనున్నారు. ఈ రైతు మేళా ద్వారా రైతులకు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కలగనుంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కొడంగల్లో ఏర్పాట్లు చేపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్