
అమరావతి , 09 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ఎన్నికలను నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది.
రాష్ట్రంలో మొత్తం 2,050 వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా సహకార అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు వేచి చూడకుండా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో అవసరమైన పనులను పూర్తి చేయాలని ఆదేశించింది. ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లు, తదుపరి కార్యాచరణకు సంబంధించిన వివరాలతో పది రోజుల్లో నివేదిక అందించాలని సూచించింది.
ప్రస్తుత సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 14 ఏళ్లుగా రాష్ట్రంలో ఈ ఎన్నికలు జరగకపోవడంతో పాలకవర్గాల ఏర్పాటు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు జరిగితే సహకార సంఘాల నిర్వహణలో కొత్త పాలకవర్గాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్