ఏపీఎండీసీకి భారీ ఊరట.. మరో రూ.115 కోట్ల ప్రభుత్వ గ్యారెంటీ మంజూరు
ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆర్థిక వెసులుబాటు కల్పించింది.
Ap government


అమరావతి , 09 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆర్థిక వెసులుబాటు కల్పించింది. బొగ్గు గనుల వేలం ప్రక్రియలో సంస్థ మరింత చురుగ్గా పాల్గొనేందుకు అదనపు ప్రభుత్వ గ్యారెంటీని మంజూరు చేస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఏపీఎండీసీ రుణ పరిమితి పెరగనుంది.

ప్రభుత్వం తాజాగా మరో రూ.115 కోట్లను అదనపు గ్యారెంటీగా కేటాయించింది. దీంతో ఇప్పటివరకు రూ.906.52 కోట్లుగా ఉన్న సంస్థ రుణ పరిమితి రూ.1,021.52 కోట్లకు చేరింది. కోల్ బ్లాక్ల వేలంలో పాల్గొనే సమయంలో అవసరమైన ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, నిధుల సమీకరణలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

అయితే ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పటికీ రుణాల చెల్లింపు బాధ్యత నుంచి తప్పించుకునే అవకాశం సంస్థకు ఉండదని స్పష్టం చేసింది. తీసుకున్న రుణంతో పాటు దానికి సంబంధించిన వడ్డీని పూర్తిగా ఏపీఎండీసీనే చెల్లించాలని జీవోలో పేర్కొంది. అదనంగా ప్రభుత్వ గ్యారెంటీకి సంబంధించి ఐదు శాతం కమీషన్ను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో బొగ్గు గనుల వేలంలో ఏపీఎండీసీ పోటీతత్వం పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రానికి అవసరమైన ఖనిజ వనరుల అభివృద్ధికి ఈ వెసులుబాటు దోహదపడుతుందని భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande