
హైదరాబాద్ , 09 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఖజానా పంపిణీ కార్యక్రమం భక్తుల సందడి మధ్య కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి వెండి నాణేలను భక్తులకు అందజేస్తున్నారు. ఈ నాణేలను పొందేందుకు నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు.
అమ్మవారి ఖజానాలో భాగంగా అందించే వెండి నాణేలకు భక్తులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటిని పవిత్రమైన ప్రసాదంగా భావిస్తూ స్వీకరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దాదాపు నాలుగు క్యూ లైన్లను ఏర్పాటు చేసి పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
ఆలయ పరిసరాల్లో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో క్రమపద్ధతిలో భక్తులకు నాణేలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు ఖజానా పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. దీంతో రాబోయే రోజుల్లోనూ పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉంది. వెండి నాణేలను పొందేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తుండటంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక సందడితో కనిపిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్